Sun Nov 17 2024 21:51:12 GMT+0000 (Coordinated Universal Time)
Ranganadh : ఒక్కసారిగా హీరో అయిపోయిన హైడ్రా కమిషనర్ రంగనాధ్
హైదరాబాద్ జంట నగరాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా గురించే. దాని కమిషనర్ రంగనాధ్ పైనే.
హైదరాబాద్ జంట నగరాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా గురించే. దాని కమిషనర్ రంగనాధ్ పైనే. అక్రమ నిర్మాణాలను కూల్చివేతలపై హైడ్రా దృష్టి పెట్టింది. గత కొన్ని రోజులుగా అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తుంది. గత నెల రోజుల నుంచి చెరువుల కబ్జా పై ఫోకస్ పెట్టింది. చెరువులను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టడం లేదు. గత కొన్ని దశాబ్దాల నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించి విల్లాలను కట్టేశారు. హైడ్రాకు డిప్యుటేషన్ పై మూడు వందల మంది సిబ్బంది వచ్చారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏర్పడిన నాటి నుంచి కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఫుల్ పవర్స్ ఇవ్వడంతో....
అందులో హైడ్రా కమిషనర్ గా బాధ్యతలను చేపట్టిన రంగనాధ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఎంతగా అంటే ఎవరినీ ఉపేక్షించవద్దని నిబంధనలను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాల విషయంలో రాజీపడవద్దని సూచించారు. అసలు ఇప్పుడు రంగనాధ్ అంటేనే అందరూ హడలి పోతున్నారు. రంగనాధ్ ఈ పోస్టులో ఉన్నప్పుడే కాదు. గతంలోనూ ఐపీఎస్ అధికారిగా పలు జిల్లాల్లో పనిచేసినప్పడు ఆయన చాలా కేసులను సులువుగా సాల్వ్ చేయగలిగారు. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ఆయన వెనుదిరిగి చూడరన్న పేరుంది. కేసు దర్యాప్తుపై ప్రభావం చూడకుండా కేసును సాల్వ్ చేయడంలో దిట్ట. వరంగల్ పోలీసు కమిషనర్ గా మెడికల్ విద్యార్థిని ప్రీతి కేసును కూడా రంగనాధ్ శోధించి చివరకు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయగలిగారు.
ఒత్తిడిలు వచ్చినా...
ఇక తాజాగా హైడ్రా కమిషనర్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయనపై ఎన్నో రకమైన రాజకీయ వత్తిడులు వచ్చాయి. పేరు మోసిన బిల్డర్ల నుంచి వత్తిడి వచ్చినా వెనక్కు తగ్గలేదు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. సిబ్బందికి కూల్చివేతల సంగతి చివర వరకూ చెప్పకుండా గోప్యంగా ఉంచుతూ అనేక అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను దేనినీ వదలి పెట్టడం లేదు. నిజంగా హైడ్రా తీసుకుంటున్న చర్యల గురించి బిల్డర్లు, రాజకీయనేతల నుంచి విమర్శలు ఎదురవుతున్నప్పటికీ సామాన్య ప్రజల నుంచి మాత్రం పెద్దఎత్తున ప్రశంసలు అందుతున్నాయి. అంతేకాదు హైదరాబాద్ లో అక్రమంగా నిర్మాణం చేపట్టాలంటేనే హడలి పోయేలా హైడ్రా పనితీరు సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Next Story